సమాజంలోని పురుషాధిక్యాన్ని తేటతెల్లం చేసే నవల 'ఆరో ఆడపిల్ల'. కథ చిన్నదే. కాని ఆ కథ ద్వారా చిత్రీకరించిన ప్రపంచం చాలా విస్తృతం. పూల వ్యాపారి ఐన, పిల్లలు లేని శంకర్ రామన్ గుడి ప్రాంగణంలోంచి తెచ్చిన అనాధ బాలికను ఇంటికి తెచ్చి 'కాదంబరి' అని పేరు పెట్టి పెంచుతాడు. ఈ పురుష ప్రపంచంలో అడుగడుగునా కాదంబరి ఎదుర్కొనే పీడనలు సమాజంలోని ఉన్నతుల వివక్ష చివరికి శంకర్ రామన్ లో కూడా కనబడిన పురుషాధిక్య ధోరణి వగైరాలు బాహ్యంగా కనబడే అంశాలు. ఆ అంశాలను పట్టుకొని సమాజం లోతుకీ పురుషాధిక్యతనూ స్త్రీల మనస్తత్వపు లోతులకూ మనసు తీసుకొని వెళ్తాడు రచయిత. మౌలికంగా సేతు స్త్రీవాద రచయిత. స్త్రీల మనోభావాలనూ ఆలోచనలనూ సూక్ష్మంగా పరిశీలించి రాయబడిన నవలలు అతనివి. సేతు రాసిన ప్రతి మాట వెనుక, వాక్యం వెనుక, మనకు కనబడని, ఆలోచిస్తే కాని అందని అర్థం ఉంటుంది.