మాస్కో విశ్వవిద్యాలయంలో వైద్యవిద్య నభ్యసించి వైద్యవృత్తి చేపట్టవలసిన చేహొవ్ రచయితగా మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది! ఆనాటి రష్యా సమాజంలోని జీవన స్థితిగతుల మీద అనేక వ్యంగ్య రచనలు చేశారు. అందులో కథానికలూ, 'స్కెచ్చి'లూ ఉన్నాయి. హేతురాహిత్యం, ప్రగతి నిరోధకం ఆనాటి రష్యా సమాజ సారాంశం. హేతువాదాన్ని, ప్రగతితత్వాన్ని హింసించే కాలమని చరిత్రకారులు ఆనాటి రష్యానూ, జారు చక్రవర్తుల నిరంకుశత్వాన్ని ఎండగడుతూ రచనలు చేశారు. ధనార్జన, స్వీయ పురోగతికి అంకితమైన అనామకులను గురించి చేహొవ్ కథలు రాశాడని సాహిత్య విమర్శకులంటారు. 'పటాటోపం, సంకుచిత మనస్తత్వం' గల అధికార్లనూ, బలహీనుల అణకువతనాన్ని, దాస్య భావననూ, వినమ్రతనూ కథల రూపంలో చేహొవ్ మనకందిస్తారు.