పాఠశాలకు వెళ్ళని దశ నుండి యవ్వనం వచ్చేవరకు బాలలు చదివే సాహిత్యాన్ని బాలసాహిత్యం అనవచ్చు. ఉత్తమ బాల సాహిత్యం పిల్లలలో చదివే ఆసక్తి పెంచుతుంది. ఆలోచన పెంచుతుంది. బిడియం పోగొడుతుంది. భాషాభిమానం పెంపొందిస్తుంది. మనో భవనపు కిటికీలు తెరచి జిజ్ఞాసను విరబూయిస్తుంది. యువతరానికి బాటలు వేస్తుంది.
యువ బాలసాహితీవేత్త దాసరి వెంకటరమణగారి కథలన్నీ ఈ కోవకు చెందినవే. ఒకప్పుడు చందమామ, బొమ్మరిల్లు తదితర పత్రికల్లో ప్రచురింపబడి, విశేష ఆదరణ పొందినవే. మరల గ్రంథ రూపంలో వచ్చినందున మరల మరల చదువుకొనే అవకాశ౦ కలుగుతుంది.