శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారకదేవుని ఏకైక పుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయుచున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ్రుంకులిడుచున్నది. రాజపురోహితుడు 'అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే' అని ప్రారంభించి, 'దశాపరేషాం దశపూర్వేషాం' అను మంత్రములతో రాజకుమారికను గోదావరీ స్నానము పూర్తి చేరుంచెను.
గట్టుపైన తనకై నిర్మించిన శిబిరములోనికి బోరు, యా బాలిక యుచిత వేషము ధరించి చెలులు కొలుచుచుండ నీవలికివచ్చి, అక్కడచేరిన భూదేవు లందరకు సంభావనలు సమర్పించినది. ఆ వెనుక స్యందనమెక్కి, విడిది చేసియున్న మహాభవనమున బ్రవేశించినది.