పాదయాత్ర మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కొత్త పద్ధతిలో వాస్తవాల్ని చెప్పేందుకు అదొక సాధనం. ఆత్మవ్యక్తీకరణకు అపరిమితమైన అవకాశాల్ని కల్పించేది పాదయాత్ర. ఇది జీవితపు తాజాదనాన్ని అనుభవించటానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల భావవ్యక్తీకరణ పడునేక్కుతుంది. ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది.ఈ ఆసక్తి నుంచే ఆదినారాయణ బయలుదేరి పాదయాత్రలు చేశారు. తన అనుభవాల్ని మూడు భిన్నమైన పేర్లతో, ఆకర్షణీయమైన ఉప శీర్షికలతో పుస్తకాలుగా రాశారు. అన్నిటినీ కలిపి అర్ధవంతంగా 'భ్రమణ కాంక్ష' అనే పేరు పెట్టారు. ఏ పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేసిందీ, దానికి సంబంధించిన ముందుమాటలతో, ఆ యాత్రా మార్గాల చిత్రణలతో, ఆయా సందర్భాలకి సరిపోయే స్వీయ చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం ఆదినారాయణ ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తుంది.