కోల్పోయిన, పరిహరింపబడిన, కాలుష్యానికి గురైన స్వేచ్చనుతిరిగి పొందటంలో భాగంగా తనని తానూ స్వచ్చ పరచుకోవటం, స్వస్థత పొందటం అనే భారం దిగంబర కవిత మోయక తప్పలేదు. ఈ భారాన్ని మోయటమనే విషయంలో దిగంబరులు గుండె దిటపు గొప్పది. ఈ క్రమంలో దిగంబరులు కీర్తిని, అపకీర్తిని సరిసమానంగానే పొందారు. ఏ సామాజిక, సాహిత్య ఉద్యమమైనా ప్రజా బాహుళ్యాన్ని కదిలించటానికి మూడు పనులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అవి భావాలను సరళీకరించటం, సత్యాన్ని ఆవిష్కరించటం, ఈ రెండిటి కలయికతో నిబద్దతో కూడిన ఆచరణను ఆశించటం. దిగంబరులు ఆశించింది, ఆకాంక్షించింది ఇదే కదా!