వీరేశలింగంగారి 'ఎదురీత' పుస్తకం గురించి చెప్పాలంటే మూఢనమ్మకాలను నిరసించడం, వితంతు వివాహాలు చేయడం, వివేకవర్ధనిలో లంచగొండులు గురించి వ్రాయడం, తెలుగులో నూతన ప్రక్రియలు ప్రారంభించడం - వీటన్నిటినీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు చేశారు. ఈ పుస్తకంలో వాటి వివరాలన్నీ చోటుచేసుకున్నాయి. వాటి గురించి విద్యార్థులకు కొంతైనా అవగాహన కల్పించగలమేమో యోచించండి. రాజమహేంద్రి పట్టణంలో ఉన్న పెద్ద లోగిళ్ళలో వీరేశలింగం గారి లోగిలి ఒకటి. 'రాజశేఖర చరిత్ర' నవలలో ఈ ఇంటినే వర్ణించారు నవయుగ వైతాళికుడు వీరేశలింగం. వీరేశలింగంగార్కి ఇద్దరు కుమారులు. ఇద్దరిలో రెండవవారు సుబ్బారాయుడు. సుబ్బారాయుడికి పున్నమ్మనిచ్చి వివాహం చేశారు. వారిద్దరి కుమారుడే మన వీరేశలింగం. వీరేశలింగం తన చిన్నతనంలో జరిగిన అనుభవం ద్వారా పిల్లల పెంపకం విషయంలో తీవ్రమైన ఆక్షేపణ చేసారు. చిన్నతనంలోనే తన జీర్ణ వ్యవస్థ దెబ్బతినడానికి కారణం తల్లి అమాయకత్వం కారణమని చెప్పారు. తల్లియొక్క గుణగణాలను వీరేశలింగం నిష్కర్షగానే చెప్పారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.