పిల్లల కథలు వ్రాయడమంటే పసి మనసులు గెలవడం. అదంత సులభం కాదు. చెరకు రసంలో ముంచిన పదాలు, పంచదార పలుకుల్లాంటి చిన్న చిన్న వాక్యాలు, తేనెలు అద్దిన తీయని భావాలతో వ్రాయడం తెలియాలి. అలా వ్రాస్తూ చిన్నారుల మనస్సులో స్థానం సంపాదించుకున్న మామయ్య శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు. తేలికైన పదాలతో, నిజజీవిత సంఘటనల సమాహారమై, ఊహించని మలుపులతో చదువరులను సంతోషపరిచే ఈ మామయ్య కథలు చదివితే కష్టార్జితం, నిజాయితీల విలువ, యుక్తి, చతురత, సమయస్పూర్తి, విజ్ఞతలు తెలుస్తాయి. పిల్లలనే కాదు పెద్దలను కూడా తమ బాల్యంలోకి జారిపోయేలా చేసి గత స్మృతులను జ్ఞాపకం చేస్తాయి.