బహు ప్రాచీనమైన పంచాయతన పూజలో గాణాపత్యము ఒకటి. భగవత్పాదులవారు ఈ పంచాయతనమునకు అగ్నిహోత్రానుష్ఠాన ప్రతీకమైన సుబ్రహ్మణ్యుని చేర్చి షణ్మతములుగా బహుళ ప్రచారం చేశారు. భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ ఏ దేవతను ఆరాధించాలన్నా మొట్టమొదటిగా గణపతిని ఆరాధించడం ఆచారం. గణపతికి చేసే ప్రత్యేక పూజ ముందు కూడా పసుపుతో గణపతిని చేసి పూజ చేస్తాము. గణపతికి ప్రత్యేకమైన గుళ్ళు ప్రసిద్ధమైనవి. మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. అయితే తమిళనాడులో ప్రతి వీథిలోనూ గణపతి దర్శనమిస్తాడు. గణపతి రూపాన్ని దర్శించిన మాత్రం చేతనే మనస్సులో అందరికీ ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది.