కలం పేరు వియోగి - అసలు పేరు కోపల్లె విజయప్రసాదు. కథలు చదివే పాఠకులకు పాతిక సంవత్సరాలుగా సుపరిచితులు. రాసింది మూడు వందల పైన కథలైనా వాటిలో చాలా కథలు పాఠకుల మెప్పును పొందాయి. అంతర్లీనంగా వీరి రచనలలో హాస్యం లాస్యం చేస్తుంది. వీరి 'బాసుగారి కుక్కగారు' హాస్య కథల సంపుటి పాఠకుల - విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక వీరికి అవార్డు తెచ్చి పెట్టింది
జీవితంలో ప్రతి మనిషికి కన్నీళ్ళు - కష్టాలు తప్పవు. స్వాంతన కోసం సాహిత్యం చదివే పాఠకులు హాస్యంలో వారి బాధలు తాత్కలికంగా మరచిపోతారు. అందుకనే ఈ హాస్య కథల సంపుటిని వెలువరిస్తున్నారు. తెలుగులో హాస్య కథలకు కొదవలేదు గాని తగిన గుర్తింపు లేదని ఫీలవుతున్నారు రచయిత. ఛానెళ్ళ - టీవీల ప్రభావంతో సాహిత్యం పాఠకుల నిరాదరణకు నోచుకుంటున్నది. తెలుగు వారికి మాతృ భాషమీద మమకారం తక్కువ కావడం కూడా పఠనీయత తగ్గిపోవడానికి ఒక కారణం! ఆంగ్లాన్ని అనుకరించడం - అనుసరించడం - కూడ తెలుగు వారి భాషకు కీడు చేస్తున్నది. దానికి తోడు ప్రాంతీయ భేదాలు - మాండలీకాల మోజు తెలుగు పాఠకులను విడగొడుతున్నది.