ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధాన పాత్ర. ఈ కధలోని వ్యక్తులందరూ అమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. అమెవల్ల పరిచయమయిన మొదటిపాత్ర ప్రకాశం.
ఎం.బి.బి.ఎస్ చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్డుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్దులతన్ని చూసి "వట్టి చవటవురా" అని తేల్చి చెప్పేవారు. 'బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీ' అని నిట్టూర్చేది వాళ్ళమ్మ.
"చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు...కనీసం నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి ఉండగలిగి మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఆయనా నాలాంటి వాడే. తెలివి తక్కువవాడు కాదుగానీ అమ్మపోయిన నాటినుంచి జీవితం మీద అదో రకం నిరక్తి పెంచేసుకున్నాడు. అందుకే నేను చిన్నప్పటి నుంచి అలాగే తయారయాను. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను భాదించేది" ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు.