భారతీయ ఋషులు అనుసరించిన జీవనవిధానానికి ‘ఆర్యధర్మము’ అని పేరు. ఈ సువిశాల భారతదేశం అనేక ఆటవికజాతులతో నిండి యుండి నాగరికులైన విద్యా వంతులు అత్యల్పసంఖ్యలో ఉన్న కాలంలో వైదికసంస్కృతి సమాజంలోని అన్ని వర్గాల జనులలోనూ కూడ ఒక నియమితమైన జీవనవిధానాన్ని ఏర్పరచినది. సమాజంలోని మేధావంతులతోనూ, విద్యావంతులతోనూ ప్రారంభించి దైనందిన జీవనానికి సంబంధించిన నియమాలు, యజ్ఞయాగాదులను ఆచరించే పద్ధతులు, దానము, త్యాగము, బ్రహ్మచర్యమూ మొదలైన సద్గుణాలు బోధింపబడ్డాయి. సమాజంలో నాగరికత అభివృద్ధి పొందినకొలదీ క్రమక్రమంగా దేశంలోని అధిక సంఖ్యాకులు ఈ వివిధ నియమాలతో నియంత్రితమైన, ప్రధానమైన సాంస్కృతిక ప్రవాహంలో ప్రవేశించారు.