అసమగ్ర జ్ఞానముతో చూచినపుడు మాత్రమే భేదములకు, విరోధములకు, తావేర్పడును గాని సంపూర్ణజ్ఞానమెప్పుడును సమన్వయ కారియే యగును. ఈ గ్రంథమున ఒక్కొక్క మండలమునను, ప్రాంతమునను ఉన్న సిద్ధాంత సంప్రదాయములను గూర్చి గూడ గ్రంథకర్త ప్రస్తావించియే యున్నాడు. ఇందు వాస్తు శాస్త్ర నిర్వచనము, గృహనిర్మాణ ప్రయోజనము, నామనక్షత్ర ప్రాధాన్యము, దిక్సాధన, శాలానిర్మాణ పద్ధతి, ఆళింద నిర్మాణ విశేషవిధులు, హస్తాది మాననిర్ణయము, శంకుస్థాపన అనగానేమి? ఉపగ్రహములు, నీటిపారుదలలు, గృహనిర్మాణ వృక్ష విజ్ఞానము, గృహారంభ యోగ్యకాలము, ఆయాది సాధ్య సమన్వయవిధి మున్నగు విషయములను, గ్రంథకర్త బహుగ్రంథ ప్రమాణాలను కాదు మెలుకువతో చర్చించి కర్తవ్యాంశములను నిర్ణయించి యున్నాడు. ఎట్టి పరిస్థితులలోను దిజ్ మూఢము కారాదని వాస్తువేత్తలు గమనించవలసి ఉన్నది. ఈ "మయవాస్తు" గృహనిర్మాతలకును, గృహస్తులకును ప్రయోజన దాయకమై బహుళ ప్రచారము నందగాలదని నమ్ముచున్నాను.