”అదేమిటి? నేను మీ చిన్ననాటి మురళినని తెలిసి మీకు ఆశ్చర్యంగా లేదూ? అస్సలు కదలికే లేదేం మీలో?” వంశీ పెదవులపై అందమైన చిరునగవు లాస్యం చేసింది. ”నాకు ఇదివరకే తెలుసు మురళీ! నువ్వు అబద్ధం చెప్పినా నాకళ్ళు అబద్ధం చెప్పవు. నీ నొక్కుల జుత్తూ, కోపం వచ్చినప్పుడు క్రింది పంటితో పై పెదవిని కొరుకుతూ, కొరకొరా చూచేతీరు, నువ్వు స్వయంగా ఎన్ని బాధలలో వున్నా, ఆర్తులపై నీవు కురిపించే దయా, శక్తికొలదీ చేసే సహాయమూ నేను ఇంకెవరిలోనూ చూడలేదు ఇంతవరకూ. నువ్వు చెప్పిన అనృతాలేమీ నేను నమ్మలేదు. నీకై నువ్వు నిజం చెప్పేవరకూ వేచి వుండాలనుకున్నాను.” ”నిజంగా?” అవధులను మించిన ఆనందాతిరేకంతో శతపత్ర సుందరివలె శోభించుతూన్న ఆ వదనాన్ని మైమరచి చూడసాగాడు వంశీ.