నిరంతర అధ్యయనం అయన అభిరుచి. క్రమశిక్షణ, పట్టుదల అయన వ్యక్తిత్వం. మూర్తీభవించిన వినయశీలి, నిగర్వి, అందరికి ఆదర్శప్రాయుడు, తెలుగు సాహిత్యంలో పరిచయం వున్న ఒక్కరికి సుపరిచితులు డా ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి. 1992 లో తెలుగు శాఖాధ్యక్షులుగా విజయనగరం మహారాజా కళాశాల నుండి పదవీవిరమణ చేశారు. అప్పటికే అంటే 1978 లో "నన్నెచోడని కుమార సంభవం" పై వ్రాసిన వ్యాసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ సంచికలో ప్రచురితమయింది. భారతి పత్రికలో అనేక వ్యాసాలు ప్రముఖుల మన్ననలు పొందాయి. "ఔచిత్యప్రస్థానం - సూరన కవిత్వం" అనే విమర్శక సిద్ధాంత గ్రంథాన్ని 1988 లో వెలువరించారు. చా. సో. మీది మక్కువతో చాసో కథా విశిష్టతను పరిచయం చేసే వ్యాసమాలికను 2002 లో ప్రచురించింది.