అవమానాన్ని ఆమానితులే సంరక్షించాల్సిన దుస్థితిని దిగువతనాన్ని దిగువ జనమే సొంతం చేసుకునే విషాదాన్ని దారిద్య్రాన్ని దరిద్రులే కాపాడుకునే వైచిత్రిని అద్భుతంగా పట్టు కోవడంలోనే ఈ నవల గొప్పతనముంది. దళిత బహుజనులు తమ మధ్య ఉన్న వైరుధ్యాల్ని భ్రమల్ని పక్కనబెట్టి అగ్రకుల పైతనాన్ని ఐక్యంగా ఎదిరించడం ద్వారానే బతికి బట్టకట్ట గలుగుతున్నారనే రాజకియ స్పృహను ఈ నవల స్పష్టంగా వ్యక్తం చేస్తుంది.
శాంతి నారాయణ గారి పెన్నేటి మలుపులు నవలలోని వర్ణనలు రాహుల్ సంకృత్యాయాన్ మధురస్మృతి జయ ఔదేయను తలపిస్తున్నాయి..స్వాతంత్య్రం వచ్చి అర్ద శతాబ్దం (కథాకాలం నాటికీ ) దాటినా రాయలసీమ సంస్కృతిలోని పెత్తందారీ విధానంలో మార్పు రాలేదని ఈ రచయిత బాహాటంగా దృశ్య కథనం చేసాడు. దళిత బహుజనుల ఆత్మగౌరవ ధిక్కార స్వరం నిక్కీ చూస్తూ ఉంటుంది ఈ నవలలో.