57 ఏళ్ళ కిందటి విషయం. ఈనాటి పండితులూ, రచయితలూ అంతా ఆ రోజుల్లో కుర్రకారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ప్రొప్రైటర్ ఎం. ఎన్. రావు ఆఫీసులో ఓ ప్రముఖ పుస్తక ప్రచార ప్రణాళికను ప్రారంభించారు. నెలనెలా నాలుగేసి పుస్తకాలు - ఒక్కొక్కటీ కేవలం రు. 2/- లకు అచ్చువేసి దేశంలో సాహితీప్రియులకు అందేటట్లు చూడడం.
అప్పుడు నా వయస్సు కొమ్మూరి వయస్సు, వీరాజీ వయస్సు, మంజుశ్రీ వయస్సు దాదాపు 23. మమ్మల్ని రెచ్చగొట్టి వ్రాయించేవాడు. ఆనాడు రాసిన నవలే 'పిడికెడు ఆకాశం'. చాలా పాపులర్. మొదటి విడతే చాలా త్వరగా ఖర్చుయిపోయింది. మరో విడత ప్రింట్ చేయాలని తెలియని రోజులు. గ్రంథమాల పుస్తకాలతో దేశం ఉర్రూతలూగింది. అన్నీ బాపూ కవర్ పేజీలతో-మా షెల్ఫ్‌లు వెలిగిపోతూ ఉండేవి.
పుస్తకం కాపీ దాచుకోవాలని కానీ, తర్వాతి కాలంలో రెండో ముద్రణకు వెళ్ళాలని కానీ తెలియని రోజులు. కాలం గడిచి - నా రూటు మారి నాటకం, సినిమా - ఇలాంటి దారులలో ప్రయాణం చేశాను.
తీరా సంవత్సరాల తర్వాత వెదికితే కాపీ దొరకలేదు. ఈ నవల ఇతివృత్తం ఆధారంగా నేనూ కె. విశ్వనాథ్‌గారూ సినిమా చేశాం. పేరు 'ఓ సీత కథ'. నవల రేడియో నాటిక అయింది. అయినా ప్రింట్ కాపీ మిగలలేదు.
మధ్యమధ్య నవల మరో ముద్రణవేస్తే బాగుణ్ణనిపించేది. కానీ కాపీ ఏది? ఇలా సంవత్సరాలు కాదు, దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ లోగా ఎవరో మద్రాసు రేడియో ఆఫీసరు నన్ను పిలిపించి నవలంతా రేడియోలో చదివించారు. అది కూడా పవర్ ట్రాక్‌గా ప్రింటయింది. ఈ మధ్య హడావుడిగా వెదుకులాట ప్రారంభమయింది. కాపీ లేదు. ఎవరో ఈ సౌండ్ ట్రాక్‌కి ఇచ్చారు. సాహితీప్రియులు, నా మిత్రులు మానస ఫౌండేషన్ రాయుడుగారు 3 నెలలు రాయించారు. అదే ఈ నవల.
ఇది చాలా కారణాలకు అపురూపమయిన నవల-చరిత్రలో భాగం. నా అభిమాన నవల నాకే కాదు. తెలుగు సాహితీ ప్రపంచంలో చాలా మందికి అభిమాన నవల.