”మీరా” పన్నెండేళ్ల బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలులేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారుకొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయ్యింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు. అవుట్డోర్ షూటింగు కోసం హీరో నరహరి ఆ ప్రాంతాలకు వచ్చాడు. అతని కంటపడింది అపరింజిబొమ్మ మీరా. కంటికింపుగా అతని గుండెల్లో చిన్న అలరింపు, ఒకింత పులకింపు. అతడు దుష్యంతుడు. భర్త పొందులో మీరా అమర సుఖాలు అనుభవించలేదు. నరహరి మనుష్యుల నుంచి ఈసడింపు అపారంగా పొందింది. ఇంత పెద్దదేశంలో అంత చిన్నవాళ్లని ఆమె పట్టించుకోలేదు. చివరికి – జారిణిగా కూడా ఆమెపై నింద పడింది. విని తట్టుకుంది. కానీ కట్టుకున్న భర్త సైతం ఆ నిందను నమ్మిన వైనానికి తల్లడిల్లిపోయింది. లోకాన్ని పట్టించుకోని మీరా భర్త వైఖరికి కృంగిపోయింది. ఆపైన ఆమె ఏమిచేసింది? ఇది ప్రశ్న! జవాబు కడుసూటిగా, హుందాగా స్త్రీ వ్యక్తిత్వానికి ఒక మణికీరీటాన్ని తొడిగిన కౌసల్యాదేవి కమనీయ రచన ”పూజారిణి”