ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయం, పరిశ్రమలు రెండు ముఖ్య అంశాలు. రెండు ఒకదానితో ఒకటి ముడిబడినటువంటి వ్యవస్థలు. అయితే ఇప్పటి సందర్భంలో అభివృద్ధి అంటే పరిశ్రమలు, పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలను అభివృద్ధి చేయడం, సహజవనరులను పరిశ్రమలకై వాడడం (అంటే ఒక విధంగా నాశనం చేయడం). ఇటువంటి 'అభివృద్ధి' ప్రకృతిని, ప్రకృతి వనరులను అతిగా, అనవసరంగా వాడి పర్యావరణాన్ని ఎంతగానో నాశనం చేయడం మనం చూస్తూనే ఉన్నాము. మనదేశంలో వ్యవసాయ సంక్షోభం తారా స్థాయికి చేరుకుని, చివరకు వేల సంఖ్యల్లో రైతులు, మహిళా రైతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ, మహారాష్ట్రలోని విదర్భ, చివరకు వ్యవసాయంలో పేరున్న పంజాబ్ లో కూడ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అసలు వ్యవసాయ సంక్షోభం ఈ స్థితికి రావడానికి కారణాలేమిటి? దీని పరిణామాలేమిటి? ప్రభుత్వ విధానాలు ఈ విషయాల పై ఏ విధంగా స్పందిస్తున్నాయి? ఇవి మనం తప్పనిసరిగా వేయాల్సిన ప్రశ్నలు.