ఆధునిక కాలపు చారిత్రిక గ్రంథాలను తలపించే ప్రాచీన రచనల్లో మొదట చెప్పుకోదగినది 'రాజతరంగిణి'. క్రీ.శ. పన్నెండవ శతాబ్దిలో కల్హణ మహాకవి రాజతరంగిణిని రచించాడు. కల్హణుని తండ్రి చణ్పకుడు క్రీ.శ. 1090-1101 మధ్య కాలంలో కాశ్మీరాన్ని పరిపాలించిన హర్షుని వద్ద ప్రధానామాత్యుడుగాను, సర్వసైన్యాధిపతిగాను పనిచేశాడు. అందువల్ల కల్హణుడు రాజ్యచరిత్రను చాలా సమీపం నుండి చూశాడు. కల్హణ మహాకవి క్రీ.శ. 1148లో రాజతరంగిణి రచన ప్రారంభించి 1150లో పూర్తి చేశాడు. ఇతని కాలంలో కాశ్మీరాన్ని పరిపాలించిన రాజు జయసింహుడు.