వర్తమానకాలంలో ఐతే నాయకురాలిని నోబెల్ బహుమతితో సత్కరించేవారు .ఒక గొప్ప శాంతి దూతగా ప్రపంచం కొనియాడేది .సమర భూమికి చేరిన తరువాత గుడారాల ముందు విడిది చేసిన యుద్దాన్ని దాటుకుంటూ సంధిచేసుకోవడం స్వల్ప విషయమేమికాదు .ఒరా నుండి తొంగిచూస్తున్న ఖడ్గాలను నిలువరించి యుద్దాన్ని ఆపి , రక్తపాతాలకు స్వస్తి పలకడానికి మార్గం వేసింది నాయకురాలి విశాల ఆలోచన .బాలచంద్రుని ఆగడాల మూలంగా, బ్రహ్మనాయుడి యుద్ధోన్మాదం బుసలుకొట్టడంతో విచ్చిన్నమైన సంధి ఒప్పందం ఎంత రక్తపాతానికి దారితీసిందో రుధిరచరిత్ర మనకు వివరిస్తూనే ఉంది. ఆ విచ్చిన్నంతో ఎన్ని ప్రాణాలు పోయాయో, ఎందరి ఆడపడుచుల మాంగల్యం మంట గలిసిందో యుద్ధానంతరం లెక్కలు తేలడం మనo చూసాము. కనీసం కుటుంబ వారసత్వం లేకుండా అంతరించిన వంశాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అలా జరగకుండా ఉండేందుకే ముందుచూపుతో మమతల మాతృత్వంతో భవిషత్ ను దర్శించిన నాయకురాలు నలగామరాజుని ఒప్పించి కోతకేతు మహారాజు బృందాన్ని సంధి రాయబారానికి పంపింది . సంధి ప్రక్రియలో భాగంగా బ్రహ్మనాయుడి వర్గియుల గొంతెమ్మ కోర్కెలన్నిటికి అంగీకారం తెలిపింది. కోడిపోరులో కోల్పోయిన రాజ్యాన్ని ఇస్తామని , వలసకాలం ముగిసి గడచిన ఏడు నెలలకు కప్పం చెల్లిస్తామని ప్రత్యర్థుల అన్ని కోర్కెలను మన్నించిన నాయకురాలిని శాంతి దూత అని కీర్తించడం సబబుకాదా? మీరేమంటారు?