నన్నయకు బాగా ముందే తెలుగులో పద్యముందని తెలియజెప్పిన శ్రీ జయంతి రామయ్య పంతులు గారు తెలియని తెలుగు చరిత్రకారులు శాసన పరిశోధకులు సాహితి మూర్తులు వుండరంటే అతిశయోక్తి కాదు. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో తెలుగు పద్యాలున్నాయని మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయనే. శాసనాలను సేకరించి పరిష్కరించి దక్షిణభారత శాసనసంపుటి పేరిట ప్రచురించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంధ్రసాహిత్య పరిషత్తు ఏర్పాటులో కీలకపాత్ర పోషించటమేకాక ఎన్నో శిలా శాసనాలను ఆ సంస్థ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చి తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేశారు. తనకున్న ఆసక్తి కొద్దీ అనేక శాసనాల నాకళ్ళను ముందేసుకుని వాటిలోని పద్యాలనూ గుర్తించి గణ విభజన చేసి ఛందస్సుతో పాటు రెండు భాగాలుగా 'శాసనపద్యమంజరి' అనే పుస్తకాలను ప్రచురించి తెలుగు చారిత్రక సాహిత్య జగత్తుకు ఎనలేని సేవ చేశారు.