మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ. కుటుంబ జీవనంలో ఉండే ఆటుపోట్లు, అత్తగారి అసహనాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, రాగానురాగాలు, అక్కడక్కడ ప్రేమమైకాలు, ఊహాచిత్రాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది ఈ నవల. హద్దుల్లో ఉండే భార్యభర్తల "శృంగారం" అక్కడక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాద పరుస్తుంది. వారి మధ్య తియ్యని జ్ఞాపకాల నెమరులతో వివాహబంధం ఇంకా దృఢమవుతుంది. ఉన్నత వర్గాల జీవనాన్ని అనుకరించే పాత్రలున్న కుటుంబంలో పక్కదారేపట్టే వ్యక్తులనూ, ప్రత్యేకించి యువతీ, యువకులనూ సరిదిద్దడంలో పరిణతిచెందిన ఒక యువతి పాత్ర చిత్రణ ఆమోద యోగ్యంగా ఉంది. స్త్రీ కేంద్రంగా కథ నడుస్తుంది. భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోకి అన్ని కోణాలనూ ఈ నవలలో రమాదేవిగారు చిత్రించారు. కుటుంబ వ్యవస్థలో భార్యగా, కోడలిగా, వదినగా, సోదరిగా ఒక స్త్రీ తన పాత్రను ఎట్లా నిర్వహించాలో ఈ నవలలో ఆమె చిత్రించ ప్రయత్నించారు. తనకంటే చిన్నవారిని, పెద్దలను సహితం దారిలో పెట్టడానికి ఒక స్త్రీ పడే తపనను మన కళ్ళముందుంచారు.