ఒక కంటిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తన దృష్టిప్రసారం చేత అనుగ్రహించగలిగిన తల్లి. కేవలం ఆవిడ చూపు పడితే చాలు, సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్లకు సరస్వతీ కటాక్షం, లక్ష్మీకటాక్షం కావాలనుకున్నవాళ్ళకు లక్ష్మీకటాక్షం. ఒకటి గమనించాలి. రెండుకళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు ఏ వస్తువుని చూస్తున్నామో. ఆ వస్తువుని రెండుకళ్లతో చూస్తాం తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసివేయడం, ఒక కంటితో చూడకపోవడం అన్నది ఉండదు. రెండు కళ్ళూ కలిసే చూస్తాయి. ఎవరు కామాక్షి అనుగ్రహానికి పాత్రులు అవుతారో వారు సరస్వతీ, లక్ష్ముల కటాక్షానికి పాత్రులు అవుతారు. లక్ష్మీకటాక్షమన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీకటాక్షమంటే విపరీతమైన ఐశ్వర్యం అని అర్థం కాదు. లక్ష్మి అంటే గుర్తు. గుర్తించబడటానికి వీలుగా ఉంటాడు. దేని చేత అంటే, ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటి అంటే, ఆ వేళకు తినవలసిన పదార్థానికి అమ్మవారు లోటు రానివ్వదు. ఆ సమయానికి కావలసిన అన్నం ఆ సమయానికి అందుతుంది. ఏ సమయానికి కావలసిన సౌకర్యం ఆ సమయానికి అందుతుంది. సరస్వతీ కటాక్షం కావాలి అనుకున్నవాళ్ళకు సరస్వతీ కటాక్షం కలుగుతుంది.