శ్రీరమణ తెలుగు వచనోద్యానవనంలో విరిసిన నవ్వుల పువ్వు. విరిసీ విరియగానే హాస్యపరిమళాల హాయితో, పేరడీ గారడీతో అందరినీ సమ్మోహన పరచిన రచయిత. ఒకే ఒక పేరడీతో అందరి దృష్టిని ఆకర్షించారు.
దినపత్రికలలో సాహిత్యపేజీలు చదవడాని బరువై పాఠకులు పక్కన పడేస్తున్నప్పుడు ఒక్కసారి శ్రీరమణ పేరడీలు గుప్పుమన్నాయ్. వచనంతో పేరడీశాఖకి శ్రీరమణ అంటుతొక్కాడు.
కేవలం శైలిమాత్రం అనుకరించడం కాదు. రచయితల ఆలోచనాధోరణిపై అవగాహన ఉండాలి. వారి ఊతపదాలు, చెప్పేతీరు ఇంకా అనేక అంశాలపై పట్టు ఉండాలి. అప్పుడే పేరడీ ప్రాచుర్యం పొందుతుంది. శ్రీరమణ చేతిలో పేరడీ క్రాఫ్ట్ కొత్త అందాలు సంతరించుకుంది.