నీకేమీ తెలియదు, నీకేమీ చేతకాదన్న భావనతోటీ, వినయంతోటి బయలుదేరితే అరుణాచలప్రవేశం సాధ్యం. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒక్కటే ఉపాయం. పరమేశ్వరా! నాకేమీ తెలియదు. నాకున్నవన్నీ పాపాలే. నిన్ను నమ్ముకుని వస్తున్నాను. నువ్వే నన్ను అరుణాచలప్రవేశం చేయించు అని అడిగినవాడికి అరుణాచలప్రవేశం చేయిస్తారే తప్ప, అహంకృతితో, కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళలేరు. జ్ఞానసంబంధనాయనార్ అంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు. దొంగలు కొట్టేశారు. ఉన్నవన్నీ ఎత్తుకుపోతే అప్పుడాయన బాధపడి, ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమనిరాడంబరంగా, వినయంతో వెళితే అరుణాచలపట్టణంలోకి ప్రవేశించగలిగారు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం !