ఆ లోకం నుండి ఈ లోకోద్దరణకోసం దిగివచ్చిన చాలా కొద్దిమందిలో ఏసుక్రీస్తు నిస్సంసహాయంగా అతిముఖ్యుడు. కాని ఆయన పేర ఈ దేశంలో ప్రచారమౌతున్న మత రూపంవల్లా, తత్ప్రచారకుల మూలంగానూ. ఆయన ఏమాత్రం అర్థంకాలేదు ప్రజలకి. అన్ని మతాలూ ఓ పాదపీఠం ముందుకే తీసుకుపోతాయని పెదిమలతో పలికే వారిలోకూడా కిరస్తానీ మతమనేప్పటికి నొసలు వెక్కిరిస్తోనే ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనకి గురువు అత్యవసరమనే హిందూ విశ్వాసాన్ని క్రిస్టియన్లు ఒప్పుకోకపోవడం చాలా విచిత్రం. గురువులలో పరమ గురువు ఏసు. గొప్పగురువుల మల్లేనే ఆయన "నేను ద్వారాన్ని నేనే కాంతిని నేనూ తండ్రీ ఒకటే". అంటున్నారు. ఆ బోధకి బలాన్నిచ్చింది ఆయనలోని ప్రేమ. ఆయన బోధలో ప్రతిమాటలో చేతలో అవ్యాజమూ అప్రతిహతమైన ప్రేమ వ్యక్తమౌతుంది.