ఒకప్పుడు తెలుగువారి సామ్రాజ్యం పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రం వరకు విస్తరించి ఉండేది. ఈ జాతి సంస్కృతీపర విజయాలను అమరావతీ కళ గొప్పగా చాటి చెప్తుంది. వీరి సముద్ర, వలసస్థావర కార్యకలాపాలు అద్భుతగాథలుగా వినుతికెక్కాయి. ఏ ప్రాచీన జాతీ అలా అన్నిశాఖలలోను అద్వితీయ విజయాలను చూరగొన్న దాఖలాలు లేవు. చాలా ప్రాచీనకాలం నుండి కూడ ఆంధ్రులు జాతిపరంగా, సాంస్కృతిక పరంగా ఒక విభాగంగా ఉండేవారని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రులు ప్రత్యేకజాతి అని మెగస్తనీసు చెప్పాడు. బర్నెల్ చెప్పినట్లు, భట్టిప్రోలు అక్షరాలు, వేంగి వర్ణమాల, తెలుగు-కన్నడ లిపి ఆంధ్రదేశంలో పరిణమించాయి. మనకు కొద్దిగా తెల్సిన మన కాలపు కృష్ణ ప్రాకృతానికున్న ప్రత్యేకతలు, విలక్షణతలు మరోచోట కన్పించవు. మధ్యయుగాలలో వారి దేశాన్ని 'తెలింగాణ' అని పిల్చేవారు. శాసనలిపి శాస్త్ర ఆధారంగా తెలుగువారి ప్రాచీన చరిత్రను ప్రామాణికంగా వివరించిన గ్రంథం.